యువతను భక్తి మార్గం వైపు నడిపించాలి – ఈవో

కార్యక్రమాలను రూపొందించాల‌ని ఆదేశం

తిరుపతి – నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలు రూపొందించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు ఆదేశించారు.
తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం, దాస సాహిత్యం, టిటిడి భక్తులకు అందిస్తున్న సేవలు, సనాతన ధర్మ మూలాలను పిల్లలకు తెలిపేలా, టిటిడి ప్రచురించిన ప్రముఖ పుస్తకాల సారాంశాన్ని, స్ఫూర్తిదాయక కథలను నవతరానికి తెలియజేసేలా, భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడం బాషలలో ఎస్వీబీసీ కార్యక్రమాలను రూపొందించి భక్తులకు అందిస్తోందని, నాలుగు భాషలలో వినూత్నంగా, సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మరింత నాణ్యంగా ప్రసారాలు అందించాలన్నారు. ఇప్పటికే ప్రసారం అవుతున్న కార్యక్రమాలపై విశ్లేషణ చేసుకుని, యువతను, మధ్య వయస్కుల వారిని, వృద్ధులను ఆకట్టుకునేలా సరికొత్త కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కార్యక్రమాల కల్పనలో నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచించారు.

తిరుమల, స్థానిక ఆలయాలలో సేవలు, కైంకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ముందస్తుగా ప్రోమోలను ప్రసారం చేయాలన్నారు. ప్రసార భారతిలో వేన్స్ లో ప్లేస్ మెంట్ తీసుకుని నాలుగు ఛానళ్ల ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీ, యూట్యూబ్, ఆన్ లైన్ రేడియో ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారంతో పాటు స్వామి కైంకర్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను అందించాలన్నారు. ఎస్వీబీసీ ఛానల్స్ లలో హెచ్.డి క్వాలిటీతో ప్రసారం చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో వర్చువల్ గా అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్ డి కె. పద్మావతి, ఎస్వీబీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com