హైదరాబాద్ – సుదీర్ఘమైన రాజకీయ పార్టీగా పేరు పొందిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) లో ఇప్పుడు ఒక్కటే వినిపిస్తోంది. ఇంతకూ ఎవరు ఆ లేఖను లీక్ చేశారనేది పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతోంది. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇంటి దొంగలు ఎవరు అనేది ఆరా తీస్తున్నారు అధినేత. ఈ మేరకు ఇప్పటికే అంతర్గతంగా చర్చ జరిగినట్లు సమాచారం. తన కూతురు ఎమ్మెల్సీ కవిత గత రెండు నెలల కిందట తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా అమెరికా నుంచి వచ్చిన అనంతరం చెప్పింది కూడా. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది.
అయితే ఎంతో పకడ్బందీగా పార్టీని నడుపుకుంటూ వస్తున్న కేసీఆర్ కు ఈ లేఖ బయటకు ఎలా వెళ్లిందనే దానిపై అర్థం కావడం లేదు. విచిత్రం ఏమిటంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం ఆ లేఖను కవిత రాయలేదంటూ బుకాయించేందుకు ప్రయత్నం చేశారు. మీడియా సాక్షిగా ప్రకటించారు కూడా. అయినా చివరకు వాస్తవం ఏమిటనేది బయట పడింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ లాంటి వాళ్లు ఖండించారు. తను రాయలేదంటూ పేర్కొన్నారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు.
కానీ ఉన్నట్టుండి అమెరికా నుంచి వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడారు కల్వకుంట్ల కవిత. తాను రెండు నెలల కిందట తన తండ్రిని ఉద్దేశించి లేఖ రాసింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఇందులో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని కానీ కాంగ్రెస్, బీజేపీలు రాద్దాంతం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా గులాబీ దళంలో కోవర్టులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది.