అమరావతి – సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆయన సినీరంగానికి చెందిన వారిని ఉద్దేశించి కొంత హెచ్చరించారు. ప్రభుత్వ తోడ్పాటు లేకుండా సినీ పరిశ్రమ అభివృద్ది జరగదన్నారు. అలా అనుకుంటే పొరపాటు అని పేర్కొన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు సినీ పరిశ్రమ అభివృద్ది కోసం తాము ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీలో విరివిగా సినిమాలు చేసుకునేందుకు, స్టూడియో నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సానుకూలంగా ఉన్నామన్నారు.
సినీ పెద్దలతో ఎప్పుడైనా కలిసి చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని తాము కొలువు తీరిన వెంటనే స్పష్టం చేయడం జరిగిందన్నారు. కానీ కొందరు సినీ పెద్దలు తమంతకు తాముగా గొప్పగా ఊహించు కోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు కందుల దుర్గేష్. ప్రత్యేకించి సినీ రంగంపై ఆధారపడిన వాళ్లు వేలాది మంది ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో సర్కార్ తోడ్పాటు అనేది అత్యంత అవసరమని , ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటాం అంటే అది అహంభావమే అవుతుందన్నారు మంత్రి.
సినీ పరిశ్రమ పట్ల గత ప్రభుత్వం అనుసరించిన తీరును అందరూ చూశారని, అయినా సినీ పెద్దలలో మార్పు రాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇండస్ట్రీ పెద్దలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు .