బెంగళూరు – బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుక చివరకు విషాదం నింపడం పట్ల క్రికెటర్లు స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. స్టార్ క్రికెటర్ , ఆర్సీబీ విజయాలలో కీలక భూమిక పోషించిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. 11 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. తనకు మాటలు రావడం లేదన్నాడు. ఇది అత్యంత బాధాకరమని వాపోయాడు. తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు.
ఘటన జరిగిన వెంటనే ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన గురించి మీడియా ద్వారా తెలిసింది. చాలా బాధ పడ్డాను. నాకు కన్నీళ్లు ఆగడం లేదన్నాడు విరాట్ కోహ్లీ. ఇన్నేళ్ల తర్వాత దక్కిన విజయం కంటే ఈ దారుణమైన ఘటన తనను కలిచి వేసిందన్నాడు . బెంగళూరులో తమకు అపూర్వమైన స్వాగతం జరిగిందని తెలిపాడు. కానీ ఇంతలోనే ఇలాంటిది జరుగుతుందని తాను కలలో కూడా అనుకోలేదన్నాడు. అందుకే అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించడం జరిగిందని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.
మరో వైపు మాజీ క్రికెటర్ టెండూల్కర్ బెంగళూరు ఘటనపై స్పందించాడు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. అనిల్ కుంబ్లే సైతం స్పందిస్తూ గాయపడిన వారంతా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపాడు. ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
