అవార్డుల పేరుతో ప్ర‌జా ధ‌నం త‌గ‌లిస్తే ఎలా..?

కాంగ్రెస్ స‌ర్కార్ పై జిలుక‌ర శ్రీ‌నివాస్ ఫైర్

హైద‌రాబాద్ – విసికె పార్టీ తెలంగా రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ జిలుక‌ర శ్రీ‌నివాస్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్ర‌జ‌ల డ‌బ్బుల‌ను ఆంధ్రోళ్ల‌కు క‌ట్ట బెడితే ఎలా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ సినిమా వేరు. తెలుగు సినిమా వేరు అని పేర్కొన్నారు. ఈ రెండు విషయాలను తెలంగాణ అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.. ఏది తెలంగాణ సినిమా అనే విషయాలను నిర్ధారించు కోవాలన్నారు. బహుశా బి నర్సింగరావు తయారు చేసిన తెలంగాణ సాంస్కృతిక విధానం ముసాయిదాలో ఈ విషయం గురించి చర్చించి వుంటారని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈనెల 14న ప్రకటించిన అవార్డుల ప్రహసనాన్ని గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని అర్థం అవుతుందని మండిప‌డ్డారు. మొత్తం అవార్డులన్నీ ఆంధ్ర సినిమాకే ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ సినిమాకు గౌరవం దక్కలేదన్నారు. తెలంగాణ డైరెక్టర్లు, నిర్మాతలు, సాంకేతిక బృందం, నటీనటులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ తాత్విక స్వభావంతో తెలంగాణ గుర్తింపు, ఉనికిని చాటే విధంగా వున్నవి మాత్రమే తెలంగాణ సినిమాలు అని స్ప‌ష్టం చేశారు జిలుక‌ర శ్రీ‌నివాస్.

అలాంటి సినిమాలు ఎక్కడివి అంటారేమో. ఇప్పటికే తీసిన వాటిలో తాను ప్రతిపాదించిన వాటిలోని కొన్ని లక్షణాలైనా వున్న సినిమాలు తప్పకుండా వుంటాయ‌న్నారు. వాటికి ఆ గౌరవం దక్కినట్టు లేదన్నారు. ఏది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ? తెలంగాణ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు స్వేచ్ఛగా కంట్రోల్ చేసే, ఫంక్షన్ చేసేది తెలంగాణ సినిమా. ఆంధ్రవాళ్లు లేదా ఏ మార్వాడీలో కంట్రోల్ చేసేది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కాలేదన్నారు.

తెలంగాణ ప్రజల డబ్బును అవార్డుల పేరుతో ఆంధ్ర సినిమాలకు ఇవ్వడం సరి కాద‌న్నారు జిలుక‌ర శ్రీ‌నివాస్. అలాగే జ్యూరీలో ఆంధ్ర వాళ్లనే మెజారిటీగా పెట్టడం కూడా సరైన విధానం కాదన్నారు. ఆంధ్ర సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులిస్తే, మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ అవార్డులిస్తుందంటూ నిల‌దీశారు. తన సినిమా ఇండస్ట్రీ బరువును తెలంగాణ మీద మోపడం చంద్రబాబుకి గౌరవాన్నిస్తుందా అని ప్ర‌శ్నించారు. ఆంధ్ర తన ఆత్మ గౌరవాన్ని చాటు కోవడానికి తన విధానాన్ని స్పష్టంగా నిర్వచించుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com