తిరుమల – శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూలైన్లను పరిశీలించారు.
భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న, పానీయాలు గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఓ వ్యక్తి దర్శన క్యూలైన్ లో అన్న ప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేక పోవడంతో అలా నినాదాలు చేశానని చెప్పారన్నారు.
అయితే క్యూలైన్ లో అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నది గమనించి తన తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై, పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేశాడని చెప్పారు.
టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ ఒక లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 లక్షలు దాటుతోందని చెప్పారు. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే దర్శనాల్లో పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రతిరోజూ 60 శాతానికి పైగా సర్వ దర్శనానికి విచ్చేసే భక్తులే స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.
