విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల‌ను తీసుకోవాలి

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల రెడ్డి

విశాఖ‌ప‌ట్నం – విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొల‌గించిన 2 వేల కార్మికుల‌ను వెంట‌నే తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. బుధ‌వారం విశాఖ క‌ర్మాగారం ముందు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేప‌ట్టారు. భారీ ఎత్తున ప్లాంటు కార్మికులు త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా కార్మికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికులను తొలగిస్తాం, ప్రైవేటుపరం చేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చ‌రించారు.

కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిన ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాల్లోకి వెళ్ళి పోయిందవేని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరి నిర్వాకం కార‌ణంగా వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. అయినా కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వ‌జ‌మెత్తారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

ఇది న్యాయమా ? ప్రధాని మోడీకి మీరు ఊడిగం చేస్తున్నారా ? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కూటమి సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అకారణంగా విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

Comments (0)
Add Comment