దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం

అద్భుత‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేశాం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి దేశం కుప్పం వైపు చూసేలా చేస్తాన‌ని అన్నారు. దానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకు వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రి ఇంటిపై విధిగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఇళ్లపై రూఫ్ టాప్ ద్వారా మనమే సొంతగా విద్యుత్ తయారు చేసుకోవచ్చ‌ని వెల్ల‌డించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే పీఎం సూర్యఘర్ పధకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. బీసీలకు రాయితీ కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ చేశామ‌న్నారు.

వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగించు కోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగిస్తామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తామ‌న్నారు. చెన్నైకి, బెంగళూరుకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. పలమనేరు నుంచి కృష్ణగిరి రహదారికి 4 లేన్ల రహదారి వేస్తున్నా మ‌న్నారు. కుప్పం నుంచి హోసూర్ వరకూ మరో సమాంతర రహదారి నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి.

కృష్ణగిరి, బెంగళూరు, కోలార్ ,చెన్నై లకూ మధ్య కేంద్రంగా కుప్పం మారుతుందన్నారు. బ్రహ్మండమైన అభివృద్ధి కుప్పంలో జరగబోతోందని జోష్యం చెప్పారు. కుప్పం రూపురేఖలు మార్చేందుకు ఓ అద్భుతమైన ప్రణాళిక తయారు చేశామ‌న్నారు సీఎం.

Comments (0)
Add Comment