మూసీ ప‌క్క‌న ఉన్న‌వాళ్లు ఖాళీ చేయాల్సిందే

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నో ఏళ్లుగా మూసీ ప‌రివాహ‌క ప్రాంతం చుట్టూ ఉన్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇక్క‌డ నివ‌సిస్తున్న వారంతా ఖాళీ చేయాల్సిందేనంటూ ప్ర‌క‌టించారు. ఇందులో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కొంద‌రు కావాల‌ని మూసీ పక్కన ఉన్నవారి ఇళ్లను కూలుస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పక్కన ఉన్నవారంతా మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వారేన‌ని అన్నారు. వారికి వెయ్యి ఎకరాలు కేటాయిస్తామని చెప్పామ‌న్నారు.

రూ. 50 వేలు జేబులో లేని మందుల సామేల్‌ను 50 వేల మెజార్టీతో నల్గొండ జిల్లా ప్రజలు గెలిపించారని ప్ర‌శంసించారు సీఎం రేవంత్ రెడ్డి. నది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పామ‌న్నారు. సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ప్ర‌శ్నించారు. ఎర్రవల్లి, మొయినాబాద్‌, జన్వాడ ఫాంహౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదన్నారు. గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నామ‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామ‌న్నారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేక పోయిందంటూ నిల‌దీశారు. యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వంలో యాదాద్రిగా మార్చారని ఆరోపించారు.. మేం వచ్చాక మళ్లీ ప్రజలంతా పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చామ‌న్నారు. తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.

Comments (0)
Add Comment