హైదరాబాద్ – బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఉన్న కొణతం దిలీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను గతంలో అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో తను ఓ డిక్టేటర్ గా వ్యవహరించడంతో పాటు కొందరికే ప్రయారిటీ ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. మొత్తంగా సర్కార్ మారడంతో తనపై కేసుల పరంపర కొనసాగుతోంది.
మీడియా డైరెక్టర్ గా ఉంటూ ఇష్టానుసారంగా ప్రభుత్వ డబ్బులను ఖర్చు చేసినట్లు సర్కార్ ఆరోపించింది. ఆనాడు కేసీఆర్, కేటీఆర్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాడని, బినామీ పేర్లతో కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు విమర్శలు ఉన్నాయి. కాగా ఇటీవలే తన భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారు.
అయితే హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని, తన అరెస్ట్ అక్రమమని పేర్కొన్నారు కొణతం దిలీప్ రెడ్డి. ఇదిలా ఉండగా తన తండ్రి కోనాథం బక్కారెడ్డికి అంకితం చేసిన జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి మే 18న దిలీప్ అమెరికాలోని వర్జీనియాకు వెళ్లారు. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2025 నాటి ఎఫ్‌ఐఆర్ నంబర్ 353కి సంబంధించి తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని, తదుపరి చర్యల కోసం నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారని వర్గాలు తెలిపాయి.