క‌బ్జాదారుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ వార్నింగ్ 

ప్రజావాణి ఫిర్యాదులపై  క్షేత్రస్థాయి పరిశీలన

హైద‌రాబాద్ – క‌బ్జాకు పాల్ప‌డే వారు ఎవ‌రైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌. ప్రజావాణి ఫిర్యాదులపై  బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి విలేజ్ లోని రంగనాథ్ నగర్ ను సందర్శించారు.  ప్లాట్  ఓనర్ల సంఘం ఇచ్చిన  ఫిర్యాదుపై వాకబు చేశారు. ప్లాట్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారు కమిషనర్ ను కలసి తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ వాపోయారు. 1985 లో 184 ఎకరాల పరిధిలో 850కి పైగా ప్లాట్లతో  లేఔట్ వేయగా తామంతా కొన్నామని చెప్పారు.

2021 కరోనా సమయంలో ప్రపంచమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలవిలలాడితే  బడా రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు సమూహంగా ఏర్పడి త‌మ‌ లేఔట్ మొత్తాన్ని కబ్జా చేశారంటూ  గోడు వెళ్ల‌బోసుకున్నారు. అప్పటికే కొంతమంది ఇళ్లను కట్టుకుని ఉండగా త‌మ‌ను తరిమేసి, ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేశార‌ని వాపోయారు.  వ్యవసాయ భూమిగా మార్చేశారని ఆరోపించారు. చివ‌ర‌కు అందులో ఉన్న దేవుడి గుడిని కూడా వదల్లేదని ఫిర్యాదు చేశారు.

తాము కోర్టులను ఆశ్రయించామని.. వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లిందని బాధితులు తెలిపారు. కోర్టు సూచనల మేరకు హై కోర్టు తమకు 4 వారాల్లో న్యాయం చేయాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని  గుర్తు చేశారు. ఈ తీర్పు ప్రకారం ఆక్రమణలను తొలగించాలని  జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ,నోడల్ అధికారికి ఆదేశాలిచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల, బోడుప్పల్  ప్రాంతాల్లో కమిషనర్   ఏవీ రంగనాథ్ పర్యటించారు.

Comments (0)
Add Comment