చెట్లతోనే మానవళి మనుగడ

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

కృష్ణా జిల్లా – చెట్లతోనే మానవళి మనుగడ సాధ్యమని, హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం, వన మహోత్సవం సందర్భంగా గురువారం పోరంకిలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపుదలకు కట్టుబడి ఉన్నామంటూ స్థానికులతో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్టుతోనే మానవాళి మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి హరితాంధ్ర ప్రదేశ్ ఆవిష్కరణకు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పండగలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం 30.5 శాతం ఉందన్నారు .ప్రతి ఏటా రాష్ట్రంలో పచ్చదనం 1.50 శాతం పెంచేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు. 2033 నాటికి 37 శాతం, 2047 నాటికి 50 శాతానికి పచ్చదనం పెంచేలా లక్ష్యంగా నిర్ణయించారన్నారు. నాటే ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారరు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. అదే సమయంలో పచ్చదనం పెంపుదలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

Comments (0)
Add Comment