నేటి షైనింగ్‌ స్టార్స్ రేపటి డైమెండ్‌ స్టార్స్‌

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్

విజ‌య‌వాడ – పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన నేటి షైనింగ్‌ స్టార్స్ రేపటి డైమెండ్‌ స్టార్స్‌గా ఎదగాలని సమాజ పురోగతికి విద్య ఎంతో దోహదపడుతుందని, విద్యార్థుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఆసరా ఉంటుందని, ఉపాద్యాయులు మార్గదర్శకులై విద్యార్ధుల కలల సాకారానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ అన్నారు.

పదవ తరగతి, ఇంటర్‌ మీడియేట్‌ `2025 పరీక్ష ఫలితాలలో అసాధారణ ప్రతిభ కనపరచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేందుకు నిర్వహించిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల కార్యక్రమం విజ‌య‌వాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్య కుమార్‌ యాదవ్‌ హాజర‌య్యారు.

రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలతో విద్యార్థులకు చదువుపట్ల మరింత ఉత్సాహం ఆసక్తిని కలిగించే విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం, డా. సర్వేపల్లి రాధాకృష్ణ , విద్యార్థి మిత్ర వంటి పథకాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని క్వాంటమ్‌ ర్యాలీగా కొత్త కొత్త ఆవిష్కరణలతో కేంద్రంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రం నుండి డిజిటల్‌ ఇండియా, మేకింగ్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో సహకారం అందిస్తున్నారన్నారు.

రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) కేంద్రంగా చేయాలని 500లకు పైగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వాలు పాఠశాల, కళాశాల విద్యను నిర్వీర్యం చేశాయన్నారు. కొత్త కొత్త పథకాలతో విద్యార్థులకు చదువు పట్ల మరింత ఉత్సాహం, ఆసక్తిని కలిగించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు వినూత్న పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.

విద్యార్థులు ఇదే ప్రతిభను కొనసాగిస్తూ భవిష్యత్‌ను తీర్చి దిద్దుకోవాలన్నారు. ఐఏఎస్‌లను స్పూర్తిగా తీసుకుని పాలసీ మేకింగ్‌లో భాగస్వాములు కావాలన్నారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో భాగంగా మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే కల సాకారంలో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు అన్ని విషయాలలోను అవగాహన కల్పించుకుని సమాజ వికాసానికి పాటుపడాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి పెట్టాల‌న్నారు.

Comments (0)
Add Comment