అమరావతి – ఎన్నో బలిదానాలు, ప్రాణ త్యాగాలు, పోరాటాలు, ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. వేలాది మంది అమరులయ్యారు. వారు చేసిన ఈ బలిదానాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదెల. జూన్ 2 ఈ దేశంలో ప్రత్యేకమైన రోజుగా మిగిలి పోతుందన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు. మూడున్నర కోట్ల ప్రజల ఆర్తి గీతం తెలంగాణ.
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల ఈ ప్రాంతమన్నారు, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ అని కొనియాడారు. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 వ ఏట అడుగు పెడుతున్న శుభ సమయాన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.