Vetri Duraisamy: కోలీవుడ్ లో విషాదం ! తొమ్మిది రోజుల తరువాత డైరెక్టర్‌ మృతదేహం లభ్యం !

కోలీవుడ్ లో విషాదం ! తొమ్మిది రోజుల తరువాత డైరెక్టర్‌ మృతదేహం లభ్యం !

Vetri Duraisamy: కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సట్లెజ్ నదిలో గల్లంతైన డైరెక్టర్‌ వెట్రి దురైస్వామి మృతదేహం ఎట్టకేలకు లభించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, స్కూబా డైవర్లు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు చర్యల్లో ప్రమాదానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వెట్రి దురైస్వామి మృతదేహాన్ని గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని కిన్నౌర్ జిల్లాలోని సట్లెజ్ నదిలో డైరెక్టర్ వెట్రి దురైస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని చెన్నైకి తరలించారు. దీనితో కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. వెట్రి దురైస్వామి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సంతాపం తెలిపారు.

Vetri Duraisamy – అసలేం జరిగింది ?

చెన్నై మాజీ మేయర్‌, మనిదనేయ మక్కల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సైదై దురైస్వామి కుమారుడు వెట్రి దురైస్వామి తిరుప్పూర్‌ కి చెందిన తన స్నేహితుడు గోపీనాథ్‌ తో కలిసి ఇటీవలే హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 4న కాజా ప్రాంతం నుంచి సిమ్లా వెళ్తుండగా కసాంగ్‌ నలా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సట్లెజ్‌ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందగా… గోపీనాథ్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు. అయితే వెట్రి దురైస్వామి మాత్రం గల్లంతయ్యాడు.

దీనితో రంగంలోనికి దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌(HP) పోలీసులు… ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వెట్రి దురైస్వామి(Vetri Duraisamy) ఆచూకీ లభ్యం కాకపోవడంతో… గాలింపు చర్యలకు స్కూబా డైవర్లు రంగంలోనికి దిగారు. ఇది ఇలా ఉండగా… తన కుమారుడి ఆచూకీ తెలిపిన వారికి కోటి రూపాయల నజరానా ప్రకటించారు సైదై దురైస్వామి. గత 9 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన స్కూబా డైవర్లు ఎట్టకేలకు… ప్రమాద స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వెట్రి దురైస్వామి మృతదేహాన్ని గుర్తించారు.

వెట్రి దురైస్వామి కోలీవుడ్‌లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. రమ్య నంబీషన్, విధార్థ్ జంటగా నటించిన ‘ఎంద్రావతు ఒరు నాల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : Deepika Padukone: బాఫ్టా అవార్డుల వ్యాఖ్యాతగా దీపిక పదుకొణె !

Sutlej River MishapVetri Duraisamy
Comments (0)
Add Comment