విశాఖపట్నం – ఈనెల 21న విశాఖలో నిర్వహించే యోగే డా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ సందర్బంగా విశాఖపట్నంకు చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం విశాఖ బీచ్ ను పరిశీలించారు. ఇక్కడి నుంచే నగరంలో పెద్ద ఎత్తున 5 లక్షల మందితో యోగా ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై దగ్గరుండి పరిశీలించారు. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండరాదని స్పష్టం చేశారు.
లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బీచ్ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 2 కోట్ల మందికి పైగా యోగా డే రోజు యోగా చేపట్టేందుకు గాను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్స్ ఇస్తున్నామని చెప్పారు. గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
యావత్ ప్రపంచం ఆరోజు ఏపీపై చూస్తుందన్నారు. తన జీవితంలో ఇది మరిచి పోలేని కార్యక్రమంగా మిగిలి పోతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా జూన్ 20వ తేదీన ఢిల్లీ నుంచి భువనేశ్వర్ లో పర్యటిస్తారు. అక్కడ పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొంటారని కేంద్ర సర్కార్ వెల్లడించింది. అనంతరం అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నంకు వెళతారు. ఆరోజు రాత్రి ఓడ రేవులకు సంబంధించిన గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఆ తర్వాత యోగా డేలో పాల్గొంటారు.