అమరావతి – ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో జరిగిన మీటింగ్ ఆయన వారిని ప్రశంసలతో ముంచెత్తారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని చెప్పారు. గత జగన్ రెడ్డి రాచరిక పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని వాపోయారు. వారు లేక పోతే పార్టీ లేదన్నారు. అందుకే ప్రజా ప్రతినిధులు కార్యకర్తలను, ప్రజలను పట్టించు కోవాలని, వారికి దగ్గరగా ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమీక్షా చేపట్టారు.
చంద్రబాబుకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలు కాలరు ఎగరేసేలా పాలన అందిస్తామన్నారు పార్టీ చీఫ్. ఈ ఒక్క ఏడాదిలో 750 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు.
ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఏ రాష్ట్రంలోనూ చేయనంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేసిన మంచిపనులు ఇవీ అని కాలరు ఎగరేసి చెప్పాలన్నారు సీఎం. ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేశారని ప్రశంసలు కురిపించారు. బాబు ష్యూరిటీ… భవిష్యత్ గ్యారెంటీ’ అని ప్రజల వద్దకు వెళ్లి చెప్పారని అన్నారు. మీ రుణం తీర్చుకోలేనని అన్నారు.
ప్రజలకు కార్యకర్తలు ఇచ్చిన మాటను నిలబెడతానని చెప్పారు. కార్యకర్తల గౌరవం పెంచేలా పని చేస్తానని అన్నారు. వచ్చే జన్మలోనూ టీడీపీ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. కార్యకర్తలది… నాది రాజకీయ బంధం కాదు కుటుంబ అనుబంధం అని అన్నారు.
