అమరావతి – ఏడాది పాలనపై 12వ తేదీన నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది కూటమి సర్కార్. అదే రోజు సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామన్నారు. ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని తెలిపారు.
బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు సీఎం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ యోగా డే నిర్వహణలో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిని గ్రాండ్ సక్సెస్ చేయాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందన్నారు. ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో చాలామార్పు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలుముకుందని, భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. 1995, 2014లో కూడా ఇన్ని ఇబ్బందులు చూళ్లేదన్నారు. రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారని వాపోయారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో పాతాళానికి తొక్కేశారని ఆరోపించారు.
అయినా సమస్యలు చూసి పారి పోలేదన్నారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలకు మనం చేసే మంచి చెప్పాలన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలన్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నానని అన్నారు. ప్రతి సమాచారాన్ని తెప్పించు కుంటున్నానని తెలిపారు.
