అమరావతి – ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సక్సెస్ మిషన్ లో కీలక భూమిక పోషించిన త్రివిధ దళాలకు తాను వందనం చేస్తున్నానని చెప్పారు. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో బెజవాడలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం బాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ, ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రులు , కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జవాన్ జై కిషాన్ అంటూ నినాదాలు చేశారు.
బెజవాడ పూర్తిగా భారతీయ జాతీయ పతాకాలతో నిండి పోయింది. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు రెప రెప లాడాయి. ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలను ఆలాపించారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని రూపు మాపాల్సిందేనని అన్నారు. ఈ సందర్బంగా మనందరం ఒక్కటై భారత ఆర్మీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు.
జాతి పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం పంచు కోవాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. 143 కోట్ల మంది భారతీయులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి, దూర దృష్టికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. పదే పదే కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలన్నారు.
