అమరావతి – ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.
యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. పక్కాగా ఆధారాల సేకరణతో నిర్ధిష్ట సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.
పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలన్నారు. రెండు ఘటనల్లో దర్యాప్తు, చర్యల వివరాలను సిఎంకు వివరించారు డీజీపీ.
అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. ఘటనలో తన్మయి అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా , ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొద్దిమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమని అన్నారు. ఈ రెండు ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి…ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని అన్నారు.
వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం అన్నారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో…గంజాయి మత్తులోనో…వ్యవస్థీకృతంగానో నేరాలకు పాల్పడే వారికి శిక్షతప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని సీఎం అన్నారు.
ఈ రెండు ఘటనలే కాకుండా…మహిళలపై అఘాయిత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలా పోలీస్ శాఖ ద్యర్యాప్తు, చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి, డ్రగ్స్, చట్టం అంటే భయం లేకపోవడం వల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని అన్నారు.
