అమరావతి – ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, పని చేసేవారికి చోటు కల్పించాలన్నారు. జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యేలు రోజూ పార్టీకి కొంత సమయం కేటాయించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి వ్యక్తం అవుతోందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఒకే నెలలో రెండు సూపర్ – 6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ విజయ యాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలన్నారు. మొదటి ఏడాది ఏం చేశామో చెప్పడంతో పాటు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
మహానాడు విజయవంతమైందని సేద తీరొద్దన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కమిటీల్లో స్థానం కల్పించాలన్నారు.