అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు జూన్ 12న గురువారం తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుక గా తల్లికి వందనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అర్హులైన తల్లులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో సీఎస్ ను ఆదేశించారు.
ఈ పథకం కింద రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం ద్వారా నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేరకు ఇచ్చిన హామీ కింద ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింప చేస్తామన్నారు సీఎం.
తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనున్నామని తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఇవాళ విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో రిలీజ్ చేశారు సీఎస్ సీఎం ఆదేశాల మేరకు.
