అమరావతి – ఏపీ సర్కార్ ఊహించని రీతిలో మాజీ సీఎం జగన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేలా చేస్తోంది. ఇందులో భాగంగా తెలివిగా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని విచారించింది.
ఇదే సమయంలో జగన్ కు షాక్ ఇచ్చేలా తనకు అనుంగు అనుచరులుగా పేరు పొందిన మాజీ సీఎస్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డితో పాటు తనకు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణ మోహన్ రెడ్డిలను అదుపులోకి తీసుకుంది. వారిని కోర్టులో హాజరు పరిచింది.
ఇదిలా ఉండగా ఈ ఇద్దరిని మూడు రోజుల పాటు విచారించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ. పలు ప్రశ్నలు సంధించింది. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఏ31, ఏ32గా నిందితులుగా ఉన్నారు ఈ ఇద్దరు. కాగా ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
జగన్ రెడ్డి పాలనా కాలంలో చక్రం తిప్పారు ధనుంజయ్ రెడ్డి. ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప. ఈ కేసులో ఏ33 నిందితుడిగా ఉన్న గోవిందప్పను ఇప్పటికే అరెస్ట్ చేసింది సిట్. ఈ ముగ్గురికి ముందస్తు బెయిల్ నిరాకరించింది కోర్టు. కాగా ఇదే కేసుకు సంబంధించి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తోందంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.