అమరావతి – ఏపీలోని బెలూం గుహలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కింది. దీనిపై స్పందించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పురాతన సంస్కృతీ నిలయాలు ఈ బెలూం గుహలు అని పేర్కొన్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయని తెలిపారు. ప్రపంచంలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయన్నారు. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు స్థానం దక్కుతుందన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే టూరిజం పాలసీని తయారు చేయడం జరిగిందన్నారు.