హైదరాబాద్ – హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. స్పాట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా చికిత్స పొందుతూ మరో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అభిషేక్ (30), ఆరూషి జైన్ (17).. హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్ (37), రాజేందర్(67), ప్రియాన్షీ(6), ప్రథమ్(13), సుమిత్ర (65).. మున్నీబాయ్ (72), ఇరాజ్(2) ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులే ఉన్నారు. బంధువుల ఇంటికి వచ్చారు. అనుకోకుండా అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు.
ఇదిలా ఉండగా హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆరా తీశారు. విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు.
ఈ ఘటన తనను కలిచి వేసిందన్నారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఎండా కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
