హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తొమ్మిది రోజుల్లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద నిధులు జమ చేస్తామని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములను అన్నింటికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. రైతులకు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు సీఎం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తనను లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. తనను విమర్శించే వారంతా కుక్కలంటూ సంచలన కామెంట్స్ చేశారు. వారు ఎన్ని ఆరోపణలు చేసినా, నిరాధారమైన కామెంట్స్ చేసినా తాను పట్టించుకోనని అన్నారు. వాటిని అన్నింటిని తాను ఆశీర్వాదంగా భావిస్తానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతులు నిత్యం ఎదుర్కొనే ఇబ్బందుల గురించి స్వతహాగా తెలుసన్నారు. గత ప్రభుత్వం ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చాలక తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు. రైతులకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని అన్నారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం తాము నిధులను జమ చేయడం జరుగుతోందన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
