సంగారెడ్డి జిల్లా – సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన దుర్ఘటనలో 47 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలాన్ని సీఎం పరిశీలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే , భారీ ప్రాణ నష్టం సంభవిస్తే మీ యాజమాన్యం ఏం చేస్తోందంటూ మండిపడ్డారు. మీ ఓనర్లు ఎక్కడ ఉన్నారు, నిద్ర పోతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. సిగాచి మేనేజ్మెంట్ పై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
సీఎంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కూడా ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ లో బాయిలర్ పేలిన ఘటనలో ఏకంగా పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కొన్ని శరీరాలు గుర్తు పట్టకుండా, చిందర వందరగా మారి పోయాయి. ప్రస్తుతానికి బాడీలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ మొత్తం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు రూ. 50 వేలు తక్షణ సాయంగా అందించాలని ఆదేశించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి.