హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని ఎన్ని సార్లయినా కలుస్తానంటూ ప్రకటించారు. ఇందులో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన పదవిలో తాను ఉన్నానని, తన రాష్ట్ర అవసరాల కోసం ఎన్నిసారైనా పీఎంను కలవాల్సి ఉంటుందన్నారు. విచిత్రం ఏమిటంటే తన ఢిల్లీ పర్యటనను రాజకీయ ఉద్దేశంతో ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్ సంబంధాలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
పొద్దస్తమానం కేంద్రంతో పేచీ పెట్టుకోవడం తన పాలసీ కాదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందన్నారు. తాను ఎంజాయ్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు. సీఎం కుర్చీ మీద కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా తాను నిద్ర పోవడం లేదని చెప్పారు. ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనే దానిపై పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని అన్నారు. పీఎం కూడా తమ పట్ల సానుకూలంగా ఉన్నారని, దీనికి ప్రధాన కారణం తాను రాష్ట్ర అభివృద్ది పై చూపుతున్న శ్రద్ద వల్లనేనని అన్నారు.
కానీ ప్రతిపక్షాలకు పనీ పాట లేకుండా పోయిందన్నారు. వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. మరోసారి తానే సీఎం అవుతానని, తనను ఏ శక్తి అడ్డుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సీఎం ఢిల్లీకి 48 సార్లు వెళ్లారు. ఇది రికార్డ్ అని చెప్పక తప్పదు.
