తమిళంలోంచి కన్నడ భాష పుట్టిందంటూ ఇలయ నాయగన్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ప్రధానంగా కన్నడ నాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు భగ్గుమన్నారు. తనకు పిచ్చి పట్టిందంటూ సీరియస్ అయ్యారు సీఎం సిద్దరామయ్య. ఆయనకు చరిత్ర తెలియదని పేర్కొన్నారు. కమల్ హాసన్ కన్నడిగులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన థగ్ లైఫ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకునేందుకు వీలు పడదు. కానీ హృదయ పూర్వకంగా క్షమాపణ చెప్పేందుకు ఎందుకు అభ్యంతరం ఉండాలని ప్రశ్నించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను గాయపర్చడం కానే కాదంటూ స్పష్టం చేసింది ధర్మాసనం. లేక పోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.
చెన్నై వేదికగా జరిగిన థగ్ లైఫ్ మూవీ ఈవెంట్ సందర్బంగా కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నడ భాషకు చరిత్ర లేదని, సదరు భాష తమిళంలోంచి పుట్టిందని పేర్కొన్నారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. ఈ సందర్బంగా దిద్దుబాటు చర్యలకు దిగారు కమల్ హాసన్. బుధవారం ఆయన స్వయంగా కర్ణాటక ఫిలిం చాంబర్ కు లేఖ రాశారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. వాస్తవానికి మనందరం ఒక్కటేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంటే తనకు వల్లమాలిన అభిమానం అని స్పష్టం చేశారు.