తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రానికి విరాళాలు , కానుకలు వెల్లువలా వస్తున్నాయి. రోజు రోజుకు కానుకలు, విరాళాల రూపేణా భక్తులు పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. దీంతో కాసులతో పాటు ఆభరణాలు కళ కళ లాడుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగితే చాలు అని అనుకునే భక్తులు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇదే సమయంలో తాజాగా కోల్ కతాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఏకంగా అందరినీ విస్తు పోయేలా చేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలకత్తాకు చెందిన సంజీవ్ గోయెంకా కుటుంబ సమేతంగా రూ.3.63 కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను చేయించి స్వామి వారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జి గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు , ఏఈవో చౌదరి సంజీవ్ గోయెంకాను అభినందించారు.