హైదరాబాద్ – మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో విల్లాలు, ఫ్లాట్స్ , ఇతర ఆస్తులు కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల విలువ కలిగి ఉందన్నారు. బీజేపీ ఆడుతున్న డ్రామాలో భాగమే ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం బీఆర్ఎస్, బీజేపీలకు అలవాటేనని పేర్కొన్నారు. ఇదంతా కేవలం తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఆడుతున్న డ్రామా అంటూ ఎద్దేవా చేశారు.
గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రధానంగా కవిత తాను ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి సంస్థ విషయంలో వసూలు చేసిన డబ్బులు, లెక్కా పత్రం ప్రకటించాలన్నారు. సంస్థపై నిజాయితీగా విచారణ జరిపించాలని మధు యాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన సమయంలో తిరిగి కొత్త నాటకానికి కేసీఆర్ అండ్ కంపెనీ తెర తీసిందని ధ్వజమెత్తారు.
ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీని నమ్మే స్థితిలో లేరన్నారు. ఆ పార్టీ ముగిసిన కథ అని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దోపిడీ, చేసిన దౌర్జన్యాలను నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఇంకా మరిచి పోలేదని, అలా అనుకుంటే పొరపాటు పడినట్లేనని అన్నారు.
