ప్రకాశం జిల్లా – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాకం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డును సందర్శించారు. ఈసందర్బంగా రైతులను పరామర్శించారు. వారికి అందుతున్న సాయం పట్ల ఆరా తీశారు. కూటమి సర్కార్ వచ్చాక తమ పరిస్థితి దయనీయంగా తయారైందని వాపోయారు బాధిత రైతులు. గిట్టు బాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మీరు ఉన్నప్పుడే తమకు బాగుండేదని ఏకరువు పెట్టారు.
రైతులను పరామర్శించిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దీనికి ప్రధాన కారకుడు సీఎం చంద్రబాబు నాయుడేనని సంచలన ఆరోపణలు చేశారు. మోస పూరితమైన హామీలు ఇవ్వడం తప్పితే కూటమి సర్కార్ చేసింది ఏమీ లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఈ సీజన్ లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పరుచూరులో ఒక రైతు, కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా సర్కార్ కు సోయి లేకుండా పోయిందన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఉన్న అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత బాబుకు దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు.
