అమరావతి – మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యా శాఖ భ్రష్టు పట్టి పోయిందని, పదవ తరగతి పరీక్షలను నిర్వహించలేక పోయారని అన్నారు. ఇటీవల జరిగిన పరీక్షల మూల్యాంకనలో అవకతవకలు జరిగాయని దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు సురేష్. దీని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా విద్యా శాఖ మంత్రి నోరు మెదపక పోవడం దారుణమన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది తేలాలన్నారు. తమ హయాంలో పరీక్షలను పకడ్డందీగా చేపట్టడం జరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షలను సరిగా నిర్వహించలేని వారు ఉన్నత పరీక్షలు, జాబ్స్ కు సంబంధించిన పోటీ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు ఆదిమూలపు సురేష్.
ఇదిలా ఉండగా రీవాల్యుయేషన్ , రీవెరిఫికేషన్ పూర్తయ్యే వరకు పాలిటెక్నిక్‌లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, IIITలలో అడ్మిషన్లను నిలిపి వేయాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా, కార్పొరేట్ కళాశాలలకు అనుకూలంగా డిపార్ట్‌మెంట్ మూల్యాంకనాలను వేగవంతం చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు సర్కార్ పై.
కొన్ని సందర్భాల్లో మార్కులు 30 నుండి 93 కి పెరిగాయన్నారు. కేవలం 21 రోజుల్లో పూర్తయిన ఈ హడావిడి ప్రక్రియ ముందస్తు JEE /NEET అడ్మిషన్ల కోసం కార్పొరేట్ ఒత్తిడి కారణంగా జరిగిందన్నారు
