హైదరాబాద్ – అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన అరెస్ట్ అక్రమమని, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం కక్ష సాధింపు దోరణితో ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎంకు పాలన చేతకాక ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు కేటీఆర్.
అక్రమ అరెస్ట్ లు, కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. ఈ మాఫియా షో రేవంత్‌ను ఎంతకాలం నడిపిస్తుందంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్. కొణతం దిలీప్ రెడ్డి అరెస్ట్ దారుణమన్నారు. తనను అదుపులోకి తీసుకోవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేనిదని పేర్కొంటూ, అరెస్టు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ఆయన గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా కొణతం దిలీప్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హవా కొనసాగించారు. డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఎవరినీ ప్రోత్సహించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్, కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శలున్నాయి. మే 18న అమెరికాకు వెళ్లాడు. తిరిగి రావడంతోనే తనకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. మొత్తంగా రెడ్డి రాజ్యంలో మరో రెడ్డి అరెస్ట్ కు గురి కావడం విచిత్రం కదూ.
