ముంబై – ప్రముఖ బాలీవుడ్ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాయాది పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశంలో ఉండడం కంటే నరకాన్ని అనుభవించడం మంచిదని అన్నారు. తాజాగా జావేద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గతంలో ఆయన పలు సందర్భాలలో స్పందించారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తీకరించడంలో పేరు పొందారు. కొన్ని సార్లు హిందూ సంఘాలు, వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, రైట్ వింగ్ ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో తీవ్ర స్థాయిలో దూషణలకు గురయ్యారు కూడా.
కళాకారులకు ప్రాంతాలు, కులాలు, మతాలు , విభేదాలు అంటూ ఉండవని స్పష్టం చేశాడు జావేద్ అక్తర్. తాము కళను నమ్ముకుని ప్రయాణం చేస్తామని, ఆ దిశగా ప్రయత్నం చేస్తామన్నాడు. కానీ కొందరు తనను తప్పుగా అర్థం చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు . ఇది పక్కన పెడితే తాజాగా పాకిస్తాన్ పదే పదే భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుండడం పట్ల మండిపడ్డాడు. ప్రధానంగా గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడడం పట్ల కన్నీటి పర్యంతం అయ్యాడు.
మతం అనేది మంచిని కోరుకుంటుందే తప్పా కాల్పులకు తెగబడదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని చెప్పాడు జావేద్ అక్తర్. ఇలాగే వ్యవహరిస్తూ పోతే ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ కు పుట్టగతులు అంటూ ఉండవన్నాడు. ఇదిలా ఉండగా శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తను హాజరయ్యారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
