హైదరాబాద్ – కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. భారీ భద్రత మధ్య ఆయన బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ విభాగాల అధిపతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్ రావు, పద్మా రావు గౌడ్, కేటీఆర్, సి. లక్ష్మారెడ్డి, మధుసూదనాచారి, మహమూద్ అలీతో పాటు పలువురు ఉన్నారు.
కమిషన్ విచారణ సందర్బంగా ప్రత్యక్షంగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ కేసీఆర్ చేసిన అభ్యర్థన మేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఫేస్ టు ఫేస్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్బంగా కేసీఆర్ ను పలు ప్రశ్నలు సంధించారు. ఆయన వెంట 200 పేజీల నోట్ తీసుకు వచ్చారు. మొత్తం ప్రశ్నలకు కూలంకుశంగా సమాధానాలు ఇచ్చారు కేసీఆర్. ఆయన విచారణ దాదాపు 55 నిమిషాలకు పైగా సాగింది. అనంతరం చాలా కూల్ గా బయటకు వచ్చారు.
అశేష జనవాహినిని ఉద్దేశించి విక్టరీ సింబల్ ను చూపించి వెళ్లి పోయారు. ఈ సందర్బంగా కమిషన్ కీలక ప్రశ్నలు సంధించింది కేసీఆర్ ను. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై ఆరా తీసింది. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని బదులు ఇచ్చారు. బ్యారేజీల్లో నీళ్లు నింపమని ఎవరు ఆదేశించారన్న కమిషన్ ప్రశ్నకు.. టెక్నికల్ అంశాల ఆధారంగా అధికారులు స్టోరేజ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ అడగడంతో.. టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయని సమాధానం ఇచ్చారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశానికి కేబినెట్ అనుమతి ఉందన్నారు. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, CWC లేఖలను కమిషన్‌కు వివరించారు.
