తెలుగు సినీ పరిశ్రమలో అలనాడు అత్యంత విజయవంతమైన చిత్రంగా వినుతికెక్కింది మాయాబజార్. వినసొంపైన పాటలు, హత్తుకునే సన్నివేశాలు, గుండెలను కదిపే సంభాషణలు..ఇలా ప్రతి సన్నివేశం ప్రత్యేకమైనదే. గతంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలన్నీ తిరిగి తెర మీదకు వస్తున్నాయి. ఇంకొన్ని ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ తరుణంలో కీలక అప్ డేట్ వచ్చింది. తెలుగు వారి లోగిళ్లలో సంచలనం సృష్టించిన చిత్రం మాయాబజార్. ఇందులో దివంగత విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, అందాల ముద్దుగుమ్మ సావత్రి, సహజ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు దిగ్గజాలు నటించారు. ఎలాంటి సాంకేతికత అభివృద్ది చెందని ఆ కాలంలోనే విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలన్నీ బిగ్ హిట్ .
ఇదిలా ఉండగా మాయాబజార్ 1957లో విడుదలైంది. ఆనాడు ప్రభంజనం సృష్టించింది. తెలుగు వారి క్లాసిక్ సినిమాల జాబితాలో ఈ మూవీ టాప్ లో నిలిచింది. తరాలు గడిచినా విడుదలై ఇన్నేళ్లవుతున్నా ఇంకా ఈ మూవీని ఆదరిస్తూనే ఉన్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఇది తెలుగు వారి గొప్పదనం..అసలైన నిండుదనం.
ఈనెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి. దీనిని పురస్కరించుకుని పూర్తిగా కలర్ వెర్షన్ లో మాయాబజార్ ను బలుసు రామారావు మే 23న శుక్రవారం విడుదల చేస్తున్నారు. కళా, ప్రేక్షక అభిమానులకు పండగేనని చెప్పక తప్పదు.
