అమరావతి – మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ అనే చీడ పురుగును రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. తను రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు. 2019-2024 సంవత్సరంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగించారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వాపోయించారు.
గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు. సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా తీసుకు వెళ్తున్నామన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వైకాపా దొంగలకి కనపడటం లేదా…కళ్ళు ,చెవులు మూసుకున్నారా అంటూ నిప్పులు చెరిగారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తాము పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఏపీ రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చెప్పారు. ఈ ఘనత కేవలం సీఎం చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం వల్లనే సాధ్యమైందని అన్నారు మంత్రి. జగన్ చేసిన నిర్వాకం కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అందుకే తన పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని , అయినా బుద్ది రాలేదన్నారు మంత్రి.