విశాఖపట్నం – విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైనదని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆరోజున మనం సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా మహానగరం వైపు చూస్తోందన్నారు. ప్రధాని మోడీజీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో ఈనెల 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఒకే ప్రాంతంలో 5 లక్షలమందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోందని అని అన్నారు. అధికారులంతా పట్టుదల, క్రమశిక్షణ, కమిట్ మెంట్ తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. . ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమం, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలని కోరారు. యోగావల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుందని ప్రధాని చెబుతున్నారు. దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్ మెంట్లలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు నారా లోకేష్. ఆరోజు ఉదయం 6.30 గంటలకు ప్రధాని ఆర్ కె బీచ్ ఖాళీమాత ఆలయం వద్ద ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారు. అంతకు గంట ముందే ప్రజలంతా ఆయా కంపార్ట్ మెంట్లకు చేరేలా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సుదూర ప్రాంతాల్లో నిలిపివేసి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. 600 మీటర్లకు మించి ప్రజలను నడిపించకుండా వాహనాలను వదలాలని సూచించారు.