విజయవాడ – క్రీడలకు కేరాఫ్ గా ఏపీని మార్చేస్తామన్నారు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. విజయవాడలో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవం మంత్రి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి, యువత లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడం, శారీరకంగా దృఢమైన సమాజ నిర్మాణం మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌లో భాగంగా 2014–2019 మధ్య ఖరారు చేసిన ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రీడారంగానికి పునాదులు పడ్డాయని, అదే మార్గంలో నేటి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి అవసరమైన గేమ్ ప్రాజెక్టులకు కేంద్రాన్ని అభ్యర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. శాప్ , ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కలసి గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియంలు నిర్మించేందుకు కృషి జరుగుతోందని, విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యమని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
ఇదిలా ఉండగా రజని, ఎ. రమణారావు, ఎం.డి. రమేశ్ కుమార్, పేరం రవీంద్రనాథ్, ఎస్. సంతోష్ కుమార్, కె. జగదేశ్వరి, బి. శివ, పి.బి.వి.ఎస్.ఎన్. రాజు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, నక్కా ఆనందబాబు, పలు కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.
