అమరావతి – ఎన్నికల ముందు బూదిలి పంచాయతీ వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాని, 2027 నాటికి చిత్రావతి నదిపై వంతెనను నిర్మించి వినియోగంలోకి తీసుకొస్తానని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ చిత్రావతి నదిపై రూ.8.52 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చిత్రావతి వరదల సమయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు.
రూ.8.52 కోట్లతో బూదిలి గ్రామం వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎంజీఎస్ వై నిధులతో వంతెనను నిర్మించనున్నట్లు వెల్లడించారు. గడువులోగా బూదిలి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, 2027 నాటికి వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. .
జాతీయ ఉపాధి హామీ నిధులతో గోరంట్ల మండలంలో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామని, 70 గోకులం షెడ్లతో పాటు 40 నీటి తొట్టెలు ఏర్పాటు చేశామని మంత్రి సవిత తెలిపారు. బూదిలి పంచాయతీలో ఇప్పటికే రూ.20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించినట్లు వెల్లడించారు. మరో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలో బూదిలి పంచాయతీలో 26 మందికి వైద్య సేవల నిమిత్తం రూ.26 లక్షల మేర సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశామన్నారు. పంచాయతీలో మొదటి విడతగా ఇళ్ల స్థలాలు కలిగిన 56 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రెండో విడతలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.