హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిశాయి. థాయిలాండ్ కు చెందిన సుందరి ఓపల్ సుచాత. గెలుపొందిన తను కిరీటాన్ని ధరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా భారతీయ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా తనకు ప్రియాంక చోప్రా అంటే చచ్చేంత ఇష్టమని పేర్కొంది. అంతే కాదు అలియా భట్ నటించిన గంగూభాయి కథియావాడి చిత్రాన్ని చూశానని, తనను అమితంగా ఆకట్టుకుందని తెలిపింది.
సమయం కుదిరినప్పుడు మంచి సినిమాలు చూస్తానని చెప్పింది. తను ప్రియాంక నుంచి స్పూర్తి పొందానని తెలిపింది. గ్రాండ్ ఫినాలే సమయంలో చోప్రాను కలిశాను. మా ఇద్దరి మధ్య ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొంది ప్రపంచ సుందరి. ఇదే సమయంలో ఇక్కడికి రావడం, రామోజీ ఫిలిం సిటీని చూడడం ఆనందంగా ఉందన్నారు.
ఇదే సమయంలో బాహుబలి మూవీ గురించి విన్నానని, త్వరలోనే ఆ సినిమాను చూస్తానని తెలిపింది సుందరి. అయితే భారతీయ సినిమాలకు సంబంధించి తనకు అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ప్రకటించింది ఓపల్ సుచాత. నటించేందుకు భాష, ప్రాంతాలు అడ్డు వస్తాయని తాను అనుకోవడం లేదంది. ప్రభాస్ గురించి విన్నానని, వీలైతే తనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపింది. తాజాగా తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
