నారా లోకేష్ జోర్దార్ ప్ర‌జా ద‌ర్బార్

విశాఖ‌లో మంత్రి ప‌ర్య‌ట‌న బిజీ బిజీ

విశాఖ‌ప‌ట్నం – కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్న మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో తన రెండో రోజు పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఆయా వినతులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు నెలవారీ జీతం చెల్లించడంతో పాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తన భర్త మరణించారని, ఉన్న ముగ్గురు పిల్లలు తనను అనాథలా వదిలేశారని, వృద్ధాప్య పెన్షన్ అందించి ఆదుకోవాలని విశాఖకు చెందిన అవ్వా కాంతం విన్నవించారు.

రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన భర్త మరణించారని, తమ కుటుంబానికి చెందవలసిన ఆస్తిని అత్త, మామ, మరిది అన్యాయంగా కాజేశారని విశాఖకు చెందిన రెడ్లదిన్నె శ్రావణి వాపోయారు. ఎలాంటి ఆదరణ లేక ఇద్దరు చిన్నపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు 2020లో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీకి చెందిన కేకే రాజు సదరు పర్యటనను అడ్డుకుని నానా బీభత్సం సృష్టించారని, పోలీసులు తూతు మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విశాఖ తాటిచెట్లపాలెంకు చెందిన కే.గోపాల్ రెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి గతంలో కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలంలోనే శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆనందపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

స్వలాభం కోసం సదరు స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కొందరు యత్నిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు నష్ట పోతారని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో తమకు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన 1.09 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి తమకు వంశపారపర్యంగా వచ్చిందని, అయితే 2022లో జరిగిన రీసర్వేలో ఎఫ్ఎమ్ బీలో సదరు భూమి సబ్ డివిజన్ ను తప్పుగా నమోదు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని విశాఖ శాతవాహన నగర్ కు చెందిన వై.వసంత లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com