ఢిల్లీ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ దేశానికి రక్షణ కవచంగా ప్రధాని పని చేస్తున్నారని, ఆయన అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ప్రధానిగా ఆయన వందేళ్లు ఉండాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. దేశానికి ఆయన దార్శికుడని కొనియాడారు. తాను తన జీవితంలో ఇలాంటి నాయకుడిని చూస్తానని అనుకోలేదన్నారు. భారత జాతి యావత్ తన వెంట ఉండడం తనను మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కష్ట కాలంలో దాయాది పాకిస్తాన్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టిన ఘనత భారత్ కు దక్కిందన్నారు. ఇక నుంచి ఎవరు మన దేశం వైపు చూసినా ఇలాగే జరుగుతుందని యావత్ ప్రపంచానికి తెలియ చేశామన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయంతో భారత్ సత్తా ఏమిటో తెలిసి పోయిందన్నారు. ఎవరు అస్థిర పర్చాలని చూసినా లేదా ఉగ్రవాదులు రావాలని ప్రయత్నం చేసినా తాట తీస్తామన్నారు. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని, ఇదంతా నరేంద్ర మోదీ నాయకత్వం వల్లనే జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.