సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

స్ప‌ష్టం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేప‌ట్టాల‌న్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ప‌వ‌న్ కు వివరించారు.

ఈ సందర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు… ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలన్నారు. ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.

టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తిను బండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.

ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com