దర్శకుడు ఆర్. నారాయణమూర్తి నిప్పులు చెరిగారు. సినీ ఇండస్ట్రీలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళామతల్లిని నమ్ముకుని ఆధారపడిన వారు వేలల్లో ఉన్నారని, వారు బాగుండాలంటే సినిమాలు కళ కళ లాడాలని అన్నారు. అయితే ఇటీవల కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సిస్టం ఇక్కడ పని చేయదని కుండ బద్దలు కొట్టారు.
ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా మండిపడ్డారు. సినిమా థియేటర్లను బంద్ చేస్తామంటూ ఎవరూ బహిరంగంగా ప్రకటించ లేదన్నారు. అలా కానప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆర్. నారాయణ మూర్తి. సినిమాలలో దమ్ముంటే ప్రేక్షకులు ఆదరిస్తారని స్పష్టం చేశారు. తాను ముందు నుంచి సామాజిక నేపథ్యం కలిగిన చిత్రాలనే ఎంచుకుంటున్నానని చెప్పారు.
సినిమాలు రిలీజ్ కంటే ముందు ధరలు పెంచడం మంచి పద్దతి కాదన్నారు. అందరికీ ఒకేలా ఉండాలన్నారు. ఎంత సేపు తమ సినిమాలు ఆడాలని, ఇతర సినిమాల వాళ్లు నష్ట పోవాలనే ధోరణి మంచి కాదంటూ హితవు పలికారు. సినీ పెద్దలు ఆయా ప్రభుత్వాల పెద్దలతో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తున్నదేనని పేర్కొన్నారు. భేషజాలు వీడి సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.