తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్థ్ర స్థాయిలో గద్దర్ పేరుతో ఫిలిం పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా మొత్తం 30 సినిమాలను ఎంపిక చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నంది అవార్డులను నిలిపి వేశారు. ఈసారి రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో తిరిగి ప్రముఖ ప్రజా గాయకుడు, యుద్ద నౌక , దివంగత గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) పేరు మీద ఇక నుంచి ప్రతి ఏటా ఫిలిం అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇందుకు సంబంధించి జ్యూరీ కమిటీని ఎంపిక చేశారు. వారి సూచనల మేరకు పూర్తి నివేదిక అందించడంతో ఎంపికైన వారి జాబితాను ఖారు చేసింది. ఆయా అవార్డులతో పాటు స్పెషల్ జ్యూరీ కింద స్మారక పురస్కారాలను కూడా ప్రకటించింది సర్కార్. వచ్చే జూన్ 12న హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ఎంపికైన వారికి పురస్కారాలను అందజేస్తారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణను ఎంపిక చేయగా, బీఎన్ రెడ్డి ఫిలిం పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని ప్రముఖ రచయిత , దర్శకుడు యుండమూరి వీరేంద్రనాథ్ ను ఖరారు చేసింది. ఆయన రచయితగా పేరు పొందారు. ఆయన రాసిన నవలలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు లక్షలాది మందిని ప్రభావితం చేశాయి.