కర్ణాటక – కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై దుమ్మెత్తి పోశారు. ప్రధానంగా ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీని టార్గెట్ గా చేశారు. తాము ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తామని అన్నారు. కానీ బీజేపీ అలా కాదని మోసం చేయడం, దోచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో తమ పాలన రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు.
తాము నిరంతరం పేదల అభ్యున్నతి కోసం ఆలోచిస్తామని, వారి కోసం కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను తీసుకు వస్తామని చెప్పారు. కానీ బీజేపీ అలా కాదని కేవలం వ్యాపారవేత్తలు, డబ్బున్న వాళ్లకు సంపదను దోచి పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. లక్ష మందికి భూ యాజమాన్య పత్రాలను అందజేశామన్నారు.
బీజేపీ తన మోడల్ కేవలం డబ్బున్న వాళ్ల కోసం మాత్రమే ఉంటుందన్నారు . అందులో కొందరు మాత్రమే బిలియనీర్లు ఉంటారని, వారు ఒక్క పైసా కూడా ప్రజల కోసం ఖర్చు చేసిన పాపాన పోలేదన్నారు. కానీ ఇతర దేశాలలో ఖర్చు చేస్తారంటూ ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ.
కన్నడ నాట ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలు అమలు కావంటూ దుష్ప్రచారం చేసిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన ఐదు గ్యారెంటీలను తూచ తప్పకుండా ఆచరణలో చేసి చూపించామని అన్నారు కాంగ్రెస్ అగ్ర నేత. తమ మోడల్ పూర్తిగా ప్రజలకు సంబంధించిన మోడల్ అని అభివర్ణించారు.