అమరావతి – ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసింది కూటమి సర్కార్. 2024 జులైలో భారీ వర్షాల వల్ల 3,071.41 హెక్టార్లలో పంట నష్ట పోయారు. ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. ఎర్రకాలువ ముంపునకు గురికాకుండా ఉండేందుకు గాను శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను తాను దగ్గరుండి చూశానని అన్నారు. అనేక ప్రాంతాల్లో 3,071.41 హెక్టార్లలో పంటలు నష్టపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిస్థితులను గమనించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి పంట నష్టపరిహార సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడం, నాట్లు వేస్తున్న సమయంలో ఈ ఇన్ పుట్ సబ్సిడీ సాయం అందడంతో రైతులకు ఉపశమనం లభించిందని మంత్రి దుర్గేష్ అన్నారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. గత ప్రభుత్వం ఎర్రకాలువ వరద నియంత్రణకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఏ చర్యలు చేపట్టక పోవడం వల్ల ప్రతి సంవత్సరం రైతులు నష్టాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎర్రకాలువ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు..