మిస్ మిల్లీ మాగీ ఆరోప‌ణల‌పై విచార‌ణ చేప‌ట్టాలి

డిమాండ్ చేసిన మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

హైద‌రాబాద్ – అందాల పోటీల సంద‌ర్బంగా నిర్వాహ‌కులు త‌న‌ను వేశ్య‌గా చూశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లీ మాగీకి సంబంధించి పూర్తిగా విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి. ఈ దెబ్బ‌తో ప్ర‌పంచంలో కాంగ్రెస్ స‌ర్కార్ హైద‌రాబాద్ ప‌రువును, బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజ్ ఏర్ప‌డింద‌న్నారు. మధ్య వయసు ఉన్న పురుషులను ఆనంద పెట్టాలని తమపై ఒత్తిడి తీసుకు వచ్చారంటూ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం.అది కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తోందన్నారు స‌బితా ఇంద్రారెడ్డి. చాలా గ్రాండ్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తాం.. పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.. ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయి యువత ఉద్యోగాలు వస్తాయి అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు..మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదు. మన రాష్ట్ర రాజధానిలో ఈ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయం. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలన్నారు.

ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరు..? ఆ వేధింపులకు కారణమైంది ఎవరు?
ఆ వ్యక్తులు ఎవరు..? ఈ అంశాలన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలన్నారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరారు,

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com